చట్టసభల సమావేశాలు ఏడాదికి కనీసం 60 రోజులు జరగాలి: ఉపసభాపతి

దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచాలంటే చట్టసభల పని దినాలు పెరగాలని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) అభిప్రాయపడ్డారు. నిన్న ఢిల్లీలో జరిగిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తొలి దశలో పార్లమెంటు సంవత్సరానికి సగటున 135 రోజులు సమావేశమవుతుందని గుర్తు చేశారు. కానీ తాను ఎంపీగా ఉన్న 17వ లోక్‌సభలో ఆ సంఖ్య 55 రోజులకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు కూడా సగటున 35 నుంచి 40 రోజులు మాత్రమే పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సమావేశాల మధ్య గరిష్ట విరామం 180 రోజులు మించకూడదనే రాజ్యాంగ నిబంధనను చాలా రాష్ట్రాలు కేవలం నిబంధన నెరవేర్చే విధంగా మాత్రమే పాటిస్తున్నాయని, ఇది సరైన విధానం కాదని అన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఏటా కనీసం 60 రోజులపాటు చట్టసభలు సమావేశాలు జరపాలని ఆయన సూచించారు.

అలాగే, ఆర్డినెన్సులపై ఆధారపడకుండా చర్చలు, సమాలోచనలు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాసన వ్యవస్థ పటిష్టంగా నిలవాలంటే నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

‘‘స్వాతంత్య్రానికి ముందు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేసిన విఠల్‌భాయ్ పటేల్ వంటి నాయకుల సేవలను గౌరవించాలంటే వారిని పొగడటమే కాకుండా, వారి ఆదర్శాలను అనుసరించి చట్టసభల సజీవతను కాపాడాలి’’ అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Read More : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

One thought on “చట్టసభల సమావేశాలు ఏడాదికి కనీసం 60 రోజులు జరగాలి: ఉపసభాపతి

Comments are closed.