పుణె నగరాన్ని కుదిపేసిన ఐటీ ఉద్యోగిని అత్యాచార ఫిర్యాదులో ఆశ్చర్యకర మలుపు చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేసిన చర్యగా అధికారులు నిర్ధారించారు. కేవలం 24 గంటల్లోనే పోలీసులు నిజాలను వెలికి తీసి ఈ కేసులో స్పష్టత తెచ్చారు. వివరాల్లోకి వెళితే… కొంధ్వా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఓ డెలివరీ ఏజెంట్ తనపై రసాయన స్ప్రే చేసి, అపస్మారక స్థితిలోకి పంపి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని, ఈ విషయం బయటపెడితే ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడని కూడా పేర్కొంది.
పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా… సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతర ఆధారాల విశ్లేషణలో ఆమె తెలిపిన వర్ణనల్లో అనేక గందరగోళాలు బయటపడ్డాయి. అత్యాచారం చేసినట్లు చెప్పిన వ్యక్తి అసలు డెలివరీ ఏజెంట్ కాదని, ఆమెకు సన్నిహితంగా పరిచయం ఉన్న స్నేహితుడని పోలీసులు గుర్తించారు. అతడు ఆమె అనుమతితోనే ఇంటికి వచ్చాడని, బలవంతంగా చొరబడలేదు అని పోలీసులు ధృవీకరించారు.
ఈ కేసుపై స్పందించిన పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్, “యువతి చేసిన ఫిర్యాదు పూర్తిగా కల్పితం. ఏ రసాయన స్ప్రే వాడలేదు, అత్యాచారమూ జరగలేదు. బెదిరింపు మెసేజ్‌ను కూడా ఆమె తానే టైప్ చేసింది” అని తెలిపారు. యువతి మానసిక పరిస్థితి బాగా లేనందున ఈ చర్యకు పాల్పడినట్టు విచారణలో వెల్లడయిందని చెప్పారు.
ఈ తప్పుడు ఫిర్యాదుతో నగరంలో భద్రతపై అనవసర ఆందోళనలు ఉత్పన్నమయ్యాయని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read More : హిమాచల్ వరదల్లో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారి : video

One thought on “పుణె ఐటీ ఉద్యోగిని రేప్ ఫిర్యాదులో షాకింగ్ మలుపు”
Comments are closed.