పృథ్వీరాజ్‌కు ఐటీ షాక్‌.. ఎంపురాన్ చిత్రంపై కొనసాగుతున్న వివాదం

Prithviraj Sukumaran IT Notices

మలయాళ సినిమా స్టార్, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం L2: ఎంపురాన్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సినిమాలోని కొన్ని దృశ్యాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో హీరో మోహన్‌లాల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పగా, మేకర్స్ కూడా కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఈ వివాదంపై పృథ్వీరాజ్ తల్లి స్పందించగా, తాజాగా పృథ్వీరాజ్‌కు ఆదాయపు పన్ను శాఖ (IT) నుంచి నోటీసులు అందాయి.

వివరాల్లోకి వెళితే… పృథ్వీరాజ్ గతంలో రూపొందించిన కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సమర్పించాల్సిందిగా IT శాఖ కోరింది. ఈ మేరకు గత నెల 29న ఆయనకు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపించగా, వచ్చే నెల 29వ తేదీలోపు పూర్తి వివరాలు అందించాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ చిత్రాలకు పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, సహ నిర్మాతగా కొంత శాతం వాటా మాత్రమే పొందారని సమాచారం. ఐటీ శాఖ ఈ దర్యాప్తును సాధారణ ప్రక్రియగా పేర్కొంది.

ఇక మరోవైపు ఎంపురాన్ నిర్మాత గోకులం గోపాలన్ చిట్‌ఫండ్ కార్యాలయాలపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. కేరళతో పాటు చెన్నైలోని పలు చోట్ల 14 గంటల పాటు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈడీ దాడులకు, పృథ్వీరాజ్‌కి వచ్చిన ఐటీ నోటీసులకు సంబంధం లేదని స్పష్టం కాగా, పృథ్వీరాజ్ ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు.

One thought on “పృథ్వీరాజ్‌కు ఐటీ షాక్‌.. ఎంపురాన్ చిత్రంపై కొనసాగుతున్న వివాదం

Comments are closed.