ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. నిందితులకు శిక్ష పడటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో సహకరించిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు అమృత కృతజ్ఞతలు తెలిపారు.
అమృత మాట్లాడుతూ, “ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని భావిస్తున్నా. ఈ పరువు హత్యలపై ఇలాంటి తీర్పులు వస్తే తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ఆశిస్తున్నా,” అని అన్నారు. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నానని, దయచేసి తమ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇటీవల ఏ2 నిందితుడికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తీర్పు వెలువడిన తర్వాత అమృత, అప్పటి నల్గొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో రంగనాథ్ ఎస్పీగా ఉన్నారు. కేసులో ఎన్నో ఒత్తిళ్లు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నిజాయితీగా వ్యవహరించి నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా పనిచేశారని అమృత ప్రశంసించారు.
తీర్పు అనంతరం ప్రణయ్ తల్లిదండ్రులు తమ కుమారుడి సమాధి వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతమయ్యారు. కేసులో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కేసులో మొత్తం 100 మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్‌షీట్ సమర్పించారని తెలిపారు.
తీర్పు అనంతరం మరణశిక్ష పొందిన A2 నిందితుడు సుభాష్ శర్మను చర్లపల్లి జైలుకు, A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు, మిగిలిన ఐదుగురు నిందితులను నల్గొండ జైలుకు తరలించారు.
