అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నెలరోజుల మాసోత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు యోగాసనాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఆమిరంలో జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఏపీలో భారీ స్థాయిలో జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నెలరోజుల పాటు యోగా శిక్షణ నిర్వహిస్తున్నారని తెలిపారు. విశాఖలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని తెలిపారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా యోగా కోసం నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 8.5 లక్షల మంది యోగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని డిప్యూటీ స్పీకర్ వివరించారు. యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా యోగాంధ్ర 2025ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, జిల్లాలో జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు.
ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రసంగంతో ముగించనున్నారని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను లైవ్‌లో ప్రసారం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
Read More : పొదిలి ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు
