తాలిబన్ ఆత్మాహుతి దాడిలో 16 సైనికుల మృతి

పాకిస్థాన్‌ను మరోసారి తీవ్ర విషాదం కమ్ముకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలానికి కారణమైంది.

పోలీసులు, అధికారులు అందించిన వివరాల ప్రకారం… పేలుడు పదార్థాలతో నిండి ఉన్న వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు సైనిక కాన్వాయ్‌ను ఢీకొనేవిధంగా నడిపించాడు. భారీ శబ్దంతో సంభవించిన పేలుడులో సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా నాశనమయ్యాయి. పేలుడు తీవ్రతతో పక్కనే ఉన్న రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. మృతుల సంఖ్య మొదట 13గా ప్రకటించినా, తర్వాత 16కి చేరినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ అనుబంధ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన 2021 నుంచి పాక్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు గణనీయంగా పెరిగాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే అంశాన్ని కేంద్రంగా చేసుకుని పాకిస్థాన్ పదేపదే ఆఫ్ఘన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే, తాలిబన్ ప్రభుత్వం వాటిని ఖండిస్తూ వస్తోంది.

ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో జరిగిన భద్రతా దాడుల్లో ఇప్పటికే 290 మంది మరణించారని, అందులో ఎక్కువమంది భద్రతా సిబ్బందేనని ఏఎఫ్‌పీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా ఘటనతో అక్కడ భద్రతా పరిస్థితులపై ఆందోళనలు మరింతగా పెరిగాయి.