పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రైలు మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర కలకలం రేపారు. బుధవారం సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ పేలుడుతో ఆ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనపై అక్కడి స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.
క్వెట్టా నుంచి పెషావర్ దిశగా ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు, జకోబాబాద్ వద్దకు చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ట్రాక్‌పై ఐఈడీ బాంబు అమర్చినట్టు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ట్రాక్‌పై సుమారు మూడు అడుగుల లోతైన గోతి ఏర్పడిందని అధికారులు తెలిపారు.
బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అయితే ప్రాణహాని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
గమనించదగ్గ విషయం ఏమిటంటే… ఇదే జాఫర్ ఎక్స్‌ప్రెస్ గతంలోనూ ఉగ్రవాదుల దాడికి గురైంది. మార్చి నెలలో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేసి వందలాది మంది ప్రయాణికులను బందీలుగా ఉంచిన ఘటన తాజాగా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో పాక్ భద్రతా సిబ్బంది మరణించగా, ప్రత్యేక ఆపరేషన్ ద్వారా బందీలను కాపాడారు. తాజాగా మళ్లీ ఇదే రైలు లక్ష్యంగా దాడి జరగడం పాక్ భద్రతపై ప్రశ్నలు వేస్తోంది.
Read More : ఇజ్రాయెల్‌పై ఫత్తా-1 హైపర్‌సోనిక్ క్షిపణులతో ఇరాన్ ప్రతీకారం.

One thought on “పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి ఉగ్రదాడి కలకలం”
Comments are closed.