అమెరికా పౌరులకు పాకిస్థాన్‌లో కీలక సూచనలు

పాకిస్థాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో, సాయుధ దళాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందున, భారత్-పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీప ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది.

పాకిస్థాన్‌లోని పరిస్థితులను, ఇరు దేశాల గగనతలాల మూసివేత వంటి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అమెరికా అధికారులు సూచించారు. అంతేకాకుండా, వివాదాస్పద ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేశారు.

‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం చేపట్టిన దాడుల అంశంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘర్షణ వాతావరణం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని ఆయన ఆకాంక్షించారు. “రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాకిస్థాన్‌లకు గొప్ప చరిత్ర ఉంది. వాటి మధ్య అనేక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలి. ఘర్షణలు వద్దు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడులపై వివరణ ఇచ్చింది. “ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగానే భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ దాడుల్లో అక్కడి పౌరులు, ఆర్థిక వనరులు లేదా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేయడం లేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు జరిగాయి” అని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వం భారత రాయబారికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read More : భారత్ వెనక్కి తగ్గితే పాకిస్థాన్ ఉద్రిక్తతలను ముగిస్తాం: ఖవాజా ఆసిఫ్