భారత వాయుసేన (IAF) పాకిస్థాన్‌పై మే నెలలో నిర్వహించిన రహస్య ఆపరేషన్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో, సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచే ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించిన క్షిపణితో పాకిస్థాన్‌కు చెందిన భారీ సైనిక విమానాన్ని కూల్చివేసి రికార్డు సృష్టించినట్లు తెలిపింది. అదేవిధంగా ఈ ఆపరేషన్‌లో ఐదు పాకిస్థానీ యుద్ధవిమానాలను కూడా ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి (ఏప్రిల్ 22)లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో, ప్రతీకారంగా మే 7న ఈ ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు IAF తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో ఆ దాడికి సంబంధించిన పత్రికా కథనాలు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో జరిగిన అత్యవసర సమావేశ దృశ్యాలు ఉన్నాయి. అనంతరం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఫైటర్ జెట్లు జరిపిన సుదూర దాడుల వీడియో దృశ్యాలను చూపించారు.
IAF వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లో పాక్ మరియు POKలోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. దీనికి ప్రతిగా పాకిస్థాన్ భారీ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయగా, భారత దళాలు వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఆపై భారత బలగాలు పాక్ వైమానిక స్థావరాలపై ప్రతిదాడి చేశాయి. మే 10న కాల్పుల విరమణతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “300 కిలోమీటర్ల దూరంలో శత్రు విమానాన్ని కూల్చివేయడం ప్రపంచంలో అరుదైన విజయాలలో ఒకటి. ఇది భారత వాయుసేన చరిత్రలో ఒక మైలురాయి” అని అన్నారు.
Read More : ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్

One thought on “ఆపరేషన్ సిందూర్‌లో పాక్ విమానాల కూల్చివేత”
Comments are closed.