దేశం గర్వించదగిన విధంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “భారత మహిళల నుదుటిన వెలిగే సిందూరానికి ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఇది భారత గౌరవాన్ని మరింతగా పెంచింది” అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు జరిపిందని, దీంతో దేశమంతా గర్వపడేలా చేశామని అమిత్ షా వివరించారు. “ఈ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢనాయకత్వమే కారణం” అని కొనియాడారు.
ఉగ్రవాదం రూపంలో దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన శక్తులను భారత దళాలు వెనక్కి నెట్టినాయని, ఇప్పుడు అవే శక్తులు తమ చర్యలకు పశ్చాత్తాపంతో బాధపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వం, నిఘా వర్గాల సమగ్ర సమాచారం, త్రివిధ దళాల సమన్వయం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఆయన వివరించారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలో తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. వీటిలో రెండు ప్రధాన ఉగ్ర కార్యాలయాలూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులకు గానీ, సైనిక స్థావరాలకు గానీ ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

One thought on “ఆపరేషన్ సిందూర్ దేశ గౌరవాన్ని మరింత పెంచింది”
Comments are closed.