పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఉగ్రదాడికి కఠిన ప్రతిస్పందనగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్‌కు పూనింది. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు సంయుక్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపాయి.
భారత ప్రభుత్వ ప్రకారం, మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఖచ్చితంగా ధ్వంసమయ్యాయి. అయితే పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేయలేదని, తమ ఉద్దేశ్యం ఉద్రిక్తతలు పెంచడం కాదని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారత సైన్యం “న్యాయం జరిగింది” అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది.
ఈ దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో “భారత్ మాతా కీ జై” అంటూ స్పందించగా, దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు రగిలాయి.
భారత దాడులను పాకిస్థాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ ప్రకారం, కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మూడు మంది మరణించగా, 12 మందికి గాయాలయ్యాయి. “భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మారుస్తాం” అంటూ పాక్ ఆర్మీ హెచ్చరించింది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, “ఈ దాడులు యుద్ధ చర్యలతో సమానం. పాక్ దీన్ని తగిన రీతిలో ఎదుర్కుంటుంది. దేశమంతా సైన్యం వెనక నిలబడి ఉంది” అని పేర్కొన్నారు. ఆయన ప్రకటన అనంతరం సరిహద్దుల్లోని పూంఛ్, రాజౌరి ప్రాంతాల్లో కాల్పుల మార్పిడి జరిగింది. మురిడ్కేలో లష్కరే తొయిబా, బహవల్పూర్‌లో జైష్-ఎ-మహ్మద్ స్థావరాలు ఉగ్రదాడుల ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని సమాచారం.
భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ 48 గంటల పాటు లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను మూసివేసింది. భారత వాయుసేన అప్రమత్తమవగా, సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించబడ్డాయి. శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్, లేహ్ వంటి విమానాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు.
ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. “ఘర్షణలు కాదు, శాంతి కావాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఇక బుధవారం ఉదయం పాక్ ప్రధాని జాతీయ భద్రతా కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది.
ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రపంచం అంతా ఇప్పుడు ఆత్రుతగా తదుపరి చర్యలపై దృష్టిపెట్టింది.
Read More : పాక్ రక్షణమంత్రి తీవ్ర హెచ్చరికలు

2 thoughts on ““ఆపరేషన్ సిందూర్”తో ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు”
Comments are closed.