తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి

_Nara-Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో తప్పు చేసిన వారెవరైనా శిక్షించబడతారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ హయాంలో జరిగిన తప్పులపై విచారణ కొనసాగుతోందని, ఎవరి పట్లనూ కక్షసాధింపులు ఉండవని, చట్ట ప్రకారమే శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత కక్షసాధింపులకు వినియోగించబోమని స్పష్టం చేశారు.నరేంద్ర మోదీతో కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఆయనతో కుటుంబసభ్యులతో కలసి కలవడం జీవితంలో మర్చిపోలేని అనుభవంగా నిలిచిందని అన్నారు. ప్రధాని దేవాన్ష్‌కు ప్రకృతిని ప్రేమించాలన్న సూచనలు ఇచ్చారని చెప్పారు. రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో మోదీ నుంచి కార్యకర్తలతో మెలగడంపై, నాయకత్వ లక్షణాలపై సలహాలు లభించాయని వివరించారు. మోదీ సూచనలు ఎప్పుడూ పాటిస్తానని చెప్పారు.

రెండు రోజులపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిగాయని, రాష్ట్రానికి మద్దతుగా వారిలో తపన కనిపించిందని తెలిపారు. విద్యారంగంలో తీసుకువచ్చే సంస్కరణలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తి చూపారని చెప్పారు. త్వరలో మరోసారి విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయనను కలవనున్నట్టు చెప్పారు.విధానసభ సభ్యుల పనితీరుపై సమీక్ష కొనసాగుతోందని, ఒక్కొక్క ఎమ్మెల్యేకు వారి పనితీరుపై నివేదిక అందజేస్తామని తెలిపారు. కొంతమందికి వారి పనితీరును మెరుగుపర్చుకునేందుకు మూడు నెలల గడువు ఇస్తామని తెలిపారు. నైపుణ్య విద్య అందించేందుకు బ్రిటన్‌కు చెందిన సంస్థతో చర్చలు జరిపామని, యువత భవిష్యత్తుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

Read More : మహిళల పక్షాన మా ప్రభుత్వమే నిలిచింది: వైఎస్ జగన్

One thought on “తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి

Comments are closed.