బీఆర్ఎస్ నేతల ఘాటైన హెచ్చరికలు.

మునుగోడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రస్తావించే స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలకు లేదని, ఇకపై ఆయన గురించి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్రి నరసింహ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూసుకుంట్ల పాదాలకు వంగిన కొందరు నాయకులే ఇప్పుడు అధికార పార్టీలో చేరి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా ఉన్నారని ఆయన విమర్శించారు. సొంత అన్నకు మంత్రి పదవి రావడాన్ని కూడా తట్టుకోలేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని నర్రి నరసింహ తీవ్రంగా విమర్శించారు. మునుగోడుకు నిధులు తెచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఆయన పదేపదే రాజీనామా డ్రామాలు చేస్తారని ఆరోపించారు.

“మంత్రి పదవి వస్తుందనే ఆశతో రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తే మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికుడు కానందున రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై అసలు ఆసక్తి లేదని, కేవలం పదవులకే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నరసింహ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధిని మినహాయిస్తే, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శివరాత్రి కవిత విద్యాసాగర్, జక్కిడి, ధనవంత్ రెడ్డి, అంతోజు శంకరాచారి తదితరులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More : శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం