ముంబైలో ఇద్దరు మహిళల మరణంపై బీఎంసీ క్లారిటీ.

ముంబైలో ఆదివారం ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కొవిడ్ కారణంగానే మరణించారని చక్కర్లు పుట్టించగా, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ వార్తలను ఖండించింది.

సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఈ మహిళలు హైపోకాల్సెమిక్ మూర్ఛ, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో మరణించారని బీఎంసీ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అనవసర ఆందోళనలకు లోనవకూడదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికీ ముంబైలో కొవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంగా బీఎంసీ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు ముంబైలో కొవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయని, మే నుంచి కొద్దిగా పెరుగుదల కనిపించినప్పటికీ పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉన్నదని వివరించారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ఐసీయూ పడకలు, సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

బీఎంసీ ప్రత్యేకించి క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధుల వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జ్వరము, దగ్గు, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని గుర్తు చేసింది.

పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేయడం వంటి రక్షణ చర్యలు అనుసరించాలని బీఎంసీ విజ్ఞప్తి చేసింది.

Read More : రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం, ఇద్దరు అరెస్ట్.

One thought on “ముంబైలో ఇద్దరు మహిళల మరణంపై బీఎంసీ క్లారిటీ.

Comments are closed.