విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటనగా ఈ యాత్ర జరుగుతోంది. జూన్ 15 నుంచి 19వ తేదీ వరకు సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను మరింత పెంచనుందని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా వివరాలు వెల్లడించింది.

మోదీ సైప్రస్ పర్యటనను జూన్ 15, 16 తేదీల్లో ప్రారంభిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధాని పర్యటించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్‌ను సందర్శించే భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. నికోసియాలో జరగనున్న ద్వైపాక్షిక చర్చలతో పాటు లిమాసోల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశం కూడా జరుగనుంది. ఈ భేటీల ద్వారా మధ్యధరా ప్రాంతంతో పాటు యూరోపియన్ యూనియన్‌తో భారత సంబంధాలు మరింత బలపడనున్నాయి.

జూన్ 16, 17 తేదీల్లో ప్రధాని కెనడా కాననాస్కిస్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ హాజరవుతుండగా, ఇది ఆయనకు వరుసగా ఆరోసారి జీ-7 వేదికపై పాల్గొనడం. ఇంధన భద్రత, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. అంతేకాక పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయి.

జూన్ 18న ప్రధాని మోదీ చారిత్రక క్రొయేషియా పర్యటనను కొనసాగిస్తారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్కోవిక్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించటం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. యూరోపియన్ యూనియన్‌లో భారత్ సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో ఈ పర్యటన కీలకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : పహల్గాం ఉగ్రదాడి వీరుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

One thought on “విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ

Comments are closed.