మహిళ హత్య కేసులో కీలక మలుపు – భర్త గురుమూర్తి పై పోలీసుల ఉక్కుపాదం

సంక్రాంతి పండుగ రోజున తన భార్య వెంకట మాధవిను హత్య చేసిన మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య మాధవి నిత్యం తనను వేధిస్తున్నదని, డామినేట్ చేస్తోందని, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి తనపై మానసికంగా హింస సాగిస్తోందన్న ఆగ్రహంతో గురుమూర్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మీర్‌పేట హత్య కేసుపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గురుమూర్తి ముందే హత్యను పథకం వేసుకున్నాడు. పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి, ఇంట్లోనే మాధవిని హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి, కాల్చి, పొడి చేసి చెరువులో వేయడం ద్వారా ఆధారాలను పూర్తిగా నాశనం చేశాడు.

డిఎన్ఏ రిపోర్ట్‌తో హత్యకు స్పష్టత

ఈ కేసు దర్యాప్తులో క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో దొరికిన టీ ష్యూస్ పరీక్షల కోసం డిఎన్ఏ ల్యాబ్‌కు పంపగా, మాధవి తల్లి, పిల్లల డిఎన్ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ అధికారులు ధృవీకరించారు. ఈ వివరాలు పోలీసులకు చేరడంతో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.

16 వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హత్యకు సంబంధించి 16 కీలక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య విచారణలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. అతను ఇంతవరకు ఇంత భయానకమైన (రాక్షసమైన) హత్య కేసు చూడలేదని తెలిపారు. హత్య అనంతరం గురుమూర్తి ఇంట్లో సర్ఫ్, ఫినాయిల్ ఉపయోగించి ఎలాంటి ఆధారాలు మిగిలిపోకుండా చేసేశాడని పోలీసులు వెల్లడించారు.

గురుమూర్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఈ కేసులో నిందితుడు గురుమూర్తిపై BNS 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత కూడా గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, నేరాన్ని కూడా అంగీకరించాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘోరమైన హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయి.

Read More : బెట్టింగ్ యాప్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ