మందార పువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు ?

ఆయుర్వేదంలో మందార మొక్కను అత్యంత ప్రాధాన్యం కలిగిన ఔషధ మొక్కగా గుర్తించారు. దీని ఆకులు, పువ్వులు, వేర్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించే ఈ పువ్వు చర్మం, జుట్టు సమస్యల నుంచి మధుమేహం, కాలేయ సంబంధ సమస్యల వరకు అనేక వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది.

చర్మ సమస్యల నివారణకు మందార పువ్వులు ప్రత్యేకంగా ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం 2–3 పువ్వులు తినడం ద్వారా చర్మంపై దద్దుర్లు, అలెర్జీ సమస్యలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. ఋతుస్రావ సమస్యలతో బాధపడే స్త్రీలు మందార ఆకుల రసం తాగితే ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

జుట్టు రాలడం, చుండ్రు సమస్యల పరిష్కారానికి కూడా మందార పువ్వులు, ఆకులు సహాయపడతాయి. నువ్వుల నూనెలో మందార పువ్వులు వేసి మరిగించి తలపై రాస్తే జుట్టు రాలడం తగ్గుతుందని, చుండ్రు సమస్య తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు మందార ఆకుల రసం ఉదయం, సాయంత్రం అరగ్లాసు నీటితో కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదనంగా, మందార పువ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మందారను ఆయుర్వేదంలో టీ, నూనె, పొడి రూపాల్లో వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ సంరక్షణకు మందార నూనెను ఉపయోగించవచ్చు. అయితే, వాడే ముందు పువ్వులు, ఆకులను శుభ్రంగా కడగడం, పరిమితి పాటించడం తప్పనిసరి. గర్భిణీలు లేదా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు వాడకానికి ముందు వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా అందుబాటులో ఉండే ఈ మొక్క ఆరోగ్యానికి అనేక రకాల మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. సరైన రీతిలో వాడితే ఆరోగ్యంగా ఉండటం ఖాయం అని వారు సూచిస్తున్నారు.

Read More : ఆలస్యంగా నిద్రపోవడం ప్రాణాంతకం ?