ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రతి విషయంలో పోటీ పడతానని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. “చంద్రబాబుతో ఛాలెంజ్ చేశాను.. నిలబెట్టుకున్నాను” అని ఆయన పేర్కొన్నారు. మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి ఇంటి పట్టాలు అందజేశారు. అనంతరం జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ, “కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ మెజార్టీ వస్తుందని చేసిన ఛాలెంజ్‌ను నెరవేర్చాను. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కార బాధ్యత తీసుకుంటాను. మంగళగిరిని ఆధునిక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం” అని అన్నారు.
తర్వాతి దశలో మంగళగిరిలో భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఇళ్ల ముందు చెత్త వేయొద్దని, ఎవరు వేస్తే వారితో కలిసి తానే చెత్త ఎత్తుతానని అన్నారు. బహిరంగ మార్కెట్ వద్ద రూ.1000 కోట్ల విలువైన భూమిపై శాశ్వత హక్కులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
తనకు ఎక్కువ మెజార్టీ ఇస్తే, అంత బలంగా ప్రజలకు సేవ చేయగలనని పేర్కొంటూ… మంగళగిరి తన గుండెల్లో ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 26 సంక్షేమ పథకాలను అమలు చేశానని గుర్తు చేశారు. ఓడిన స్థలంలో గెలిచి తాను ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నానని అన్నారు.
ఈరోజు మొత్తం 546 లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి పట్టాలు అందజేశారని, యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి, నీరుకొండ గ్రామానికి 99 మందికి, రత్నాల చెరువు కు చెందిన 199 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు.
Read More : ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

One thought on “నారా లోకేష్ వ్యాఖ్యలు: ప్రతి విషయంలో చంద్రబాబుతో పోటీ పడ్డానని స్పష్టం”
Comments are closed.