లోక్‌సభలో బుధవారం తీవ్ర హంగామా చోటుచేసుకుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే, వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దవ్వాలన్న నిబంధనలతో కూడిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి సంబంధించి అరెస్టై, నెల రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజున పదవి కోల్పోవాల్సి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. రాజీనామా చేయకపోయినా, కొత్త నిబంధనల ప్రకారం పదవి రద్దవుతుందని స్పష్టం చేశారు.
అమిత్ షా రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, జమ్ము కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లులను సభ ముందు ఉంచారు. ఈ నిబంధనలు కేంద్రం, రాష్ట్ర స్థాయిల ప్రజా ప్రతినిధులందరికీ వర్తిస్తాయని తెలిపారు.
ఈ బిల్లులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. “ఈ బిల్లుతో కార్యనిర్వాహక సంస్థలు న్యాయమూర్తి, జ్యూరీ, శిక్ష అమలు చేసే అధికారిగా మారతాయి. ప్రభుత్వాలను అస్థిరపరిచేలా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది” అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ, “నిరపరాధి అని నిరూపించుకునే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే అన్నది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రం. కానీ ఈ బిల్లుతో ఆ సూత్రాన్నే మార్చేస్తున్నారు. ఇది ఒక కార్యనిర్వాహక అధికారిని ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థాయిలో నిలబెడుతోంది” అని విమర్శించారు. సభలో గందరగోళం నెలకొనగా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అమిత్ షా, బిల్లులను హడావుడిగా తీసుకురాలేదని, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు తెలిపారు. తాను అరెస్టుకు ముందే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాతే మళ్లీ ప్రభుత్వంలో చేరానని గుర్తు చేశారు.
విపక్షాల ఆందోళనల నడుమ స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.
Read More : ముంబైలో భారీ వర్షాలు: 17 లోకల్ రైళ్లు రద్దు
2 thoughts on “30 రోజుల నిర్బంధం ఉంటే ప్రధాని–మంత్రులు పదవి కోల్పోయే బిల్లు”
Comments are closed.