కోల్‌కతాలో లా విద్యార్థినిపై జరిగిన దారుణ సామూహిక అత్యాచారం కేసు పశ్చిమబెంగాల్ రాజకీయాలను తడుముకుంటోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారానికి దారి తీసింది.
నిందితులపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా టీఎంసీ నేతలతో సంబంధాలున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి చంద్రమ భట్టాచార్యతో కలిసిన ఫోటోలను బీజేపీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ, అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఈ ఫోటోలను షేర్ చేస్తూ — “నిందితులను కాపాడటమే టీఎంసీకు ప్రాధాన్యతగా మారింది” అంటూ మండిపడ్డారు.
“మహిళల భద్రతా మమత ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదు” – బీజేపీ ఆరోపణ
“మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ మహిళలకు పీడకలలా మారింది. గతంలో కూడా నేరస్థులను కాపాడిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి అదే దిశగా వ్యవహరిస్తోంది” అంటూ బీజేపీ ఆరోపించింది.
టీఎంసీ కౌంటర్: సంఘటనను రాజకీయం చేయొద్దు
ఈ ఆరోపణలకు టీఎంసీ బలమైన ప్రతిస్పందన ఇచ్చింది. పార్టీ నేత శశి పంజా మాట్లాడుతూ – “ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది మేము చర్యలు తీసుకున్న రీతిని సూచిస్తుంది” అని అన్నారు.
నిందితులు పోలీస్ కస్టడీలో
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో కాలేజీ మాజీ విద్యార్థి మనోజిత్ మిశ్రా (31), ప్రస్తుత విద్యార్థులు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) ఉన్నారు. వీరిని అలీపూర్ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జులై 1 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతించింది. బాధితురాలి వైద్య నివేదికలో ఆమె శరీరంపై గాయాలు, గోటి గీతలు ఉన్నట్లు స్పష్టమైంది. ఇది బలవంతపు లైంగిక దాడిగా పోలీసులు నిర్ధారించారు.
గత ఘటనలతో పోలిక
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 10 నెలల క్రితం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన లైంగిక దాడి, హత్య కేసును ఈ ఘటన గుర్తుకు తెస్తోంది. అప్పట్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
Read More : పశ్చిమ బెంగాల్‌లో లా విద్యార్థిని పై అత్యాచారం కేసు.

One thought on “Gang rape case: బీజేపీ-టీఎంసీ మధ్య తీవ్ర మాటల యుద్ధం”
Comments are closed.