గుడివాడలో కోర్టుకు హాజరైన కొడాలి నాని – వైసీపీ శ్రేణుల్లో జోష్

గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం సుదీర్ఘ రాజకీయ విరామం తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా గుడివాడలో మళ్లీ ప్రజల మధ్య కనిపించి రాజకీయ వేడి రగిలించారు. శుక్రవారం (జూన్ 27) ఆయన ఓ దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు హాజరయ్యారు.

కొడాలి నాని చాలా కాలంగా బహిరంగ కార్యక్రమాలకు, రాజకీయ చర్చలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ రోజు కోర్టు ప్రాంగణంలో ఆయన ఒక్కసారిగా ప్రత్యక్షమవడం, దాంతోపాటుగా వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం గుడివాడలో రాజకీయ చురుకుదనానికి నిదర్శనంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే, ప్రస్తుత రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడికి సంబంధించి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు, గుడివాడ లోయర్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది.

ఈ మేరకు నాని గుడివాడ కోర్టుకు విచారణకు హాజరై పూచీకత్తు పత్రాలను సమర్పించారు. ఇదే కేసులో ఇప్పటికే నాని అనుచరుల్లో 16 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దాడి సమయంలో కొందరు నాని ఆదేశాల మేరకే చర్యలకు పాల్పడ్డామని విచారణలో అంగీకరించారన్న సమాచారం వెలువడుతోంది.

ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నాని, ఇప్పుడు కోర్టు వ్యవహారంతో తిరిగి గుడివాడకు రావడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఆయన రాకతో కోర్టు ప్రాంగణంలో వైసీపీ కార్యకర్తల ఉత్సాహం చెలరేగింది.

Read More : CBN : ఏపీ టూరిజం కు గ్లోబల్ దిశలో ముందడుగు

One thought on “గుడివాడలో కోర్టుకు హాజరైన కొడాలి నాని – వైసీపీ శ్రేణుల్లో జోష్

Comments are closed.