బీజేపీపై దాడికి కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కు — కిషన్ రెడ్డి ఘాటు విమర్శ!

kishan reddy

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి.. ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూరంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని.. పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాం కొడుతున్న రాహుల్ గాంధీ, కేసీఆర్‌లకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

రజాకార్ల వారసత్వాన్ని పొందిన మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ వాద భావనతో బీజేపీ పోటీ చేస్తోందని వివరించారు. మజ్లిస్ పార్టీ,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారుల వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు.
జీహెచ్ఎంసీ పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని, హైటెక్ సిటీ మాత్రమే హైదరాబాద్ కాదని వ్యాఖ్యానించారు.

One thought on “బీజేపీపై దాడికి కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కు — కిషన్ రెడ్డి ఘాటు విమర్శ!

Comments are closed.