విజయ్ కెరీర్ కు ఎంతో కీలకమైన కింగ్డమ్ విజయ్ ఆశలను నెరవేర్చిందా…!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది. తన ఎంచుకునే కథలు, నటనతో మెస్మరైజ్ చేసే విజయ్ గత కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వలన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. మరి.. విజయ్ కెరీర్ కు ఎంతో కీలకమైన ఈ సినిమా ఎలా ఉంది? యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టి, నిలబడగలుగుతాడా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ, సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి… పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు. అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అండర్ లో ఉన్న దీవిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు? ఇంతకీ శివ ఆ దీవికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది ఓవరాల్ గా సినిమా కథ.
ఎలా ఉందో ఓసారి విశ్లేషిస్తే..
అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. తెలుగులో ఇలాంటి కథలు కొత్తేమీ కాదు కానీ, మిగతావాటితో పోలిస్తే దీనిలో అన్నదమ్ముల బంధం, ద్వీపంలో చిక్కుకుపోయిన ఓ తెగ నేపథ్యమే ‘కింగ్డమ్’ను భిన్నంగా నిలుపుతుంది. గ్యాంగ్ స్టర్ కథలకి డ్రామా కీలకం. ఆ విషయంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రచన బలమైన ప్రభావమే చూపిస్తుంది. డ్రామాతో పాటు కథా ప్రపంచంలో లీనం చేసే విజువల్స్, వాటికి మరింత బలాన్నిచ్చే సంగీతం, తెరపైన పాత్రలు తప్ప నటులే కనిపించని అభినయాలు… ఇలా అన్నీ ఉన్నా ఆ స్థాయిలో భావోద్వేగాలు మాత్రం బలంగా పండించలేకపోయారు.
1920ల నాటి నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తూ కథని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఫస్ట్ సీన్ తోనే ‘కింగ్డమ్’ ప్రపంచంలో లీనమయ్యేలా చేశారు. ఆ తర్వాత కానిస్టేబుల్ గా సూరి జీవితం, అన్న జాడ కోసం అతను చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకునే సన్నివేశాలతో సినిమా వేగంగానే పరుగులు పెడుతుంది. కథ శ్రీలంకకి మారాక జాఫ్నా జైలు నేపథ్యంతో పాటు, సూరి, శివ… తాము అన్నదమ్ములమనే విషయం ఇద్దరికీ ఎప్పుడు తెలుస్తుందనే అంశాలు ప్రేక్షకుల్లో ఆత్రుతని, ఆసక్తిని రేకెత్తిస్తాయి. దర్శకుడు ఆ విషయాలపైనే దృష్టి పెడుతూ, అసలైన భావోద్వేగాల్ని ఆవిష్కరించే అవకాశం ఉన్నా, ఆ దిశగా ప్రయత్నం చేసినట్టు లేరు. అడుగడుగునా నాటకీయతతో సన్నివేశాల్ని మలిచినా, కథకు ప్రధానంగా అవసరమైన భావోద్వేగాల్ని ఆవిష్కరించలేకపోయారు. సెకండాఫ్ లోనూ అదే కథే. మరికొన్ని ఉపకథలు తోడవుతూ కథ ముందుకు సాగుతూ ఉంటుంది. కథ నుంచి పక్కకు వెళ్లకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దడం సినిమాకు కలిసొచ్చింది. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ‘కింగ్డమ్’ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో నటీనటులు, సాంకేతిక బృందం పడిన శ్రమ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రెండో భాగానికీ అవకాశం ఉండేలా కథని ముగించారు.
ఎవరెలా చేశారో చూద్దాం…
విజయ్ దేవరకొండలో ఎంత మంచి నటుడు ఉన్నాడో మరోసారి రుజువు చేసే చిత్రమిది. సూరి పాత్రలో ఒదిగిపోయాడు. తెరపైన ఎక్కడా విజయ్ కనిపించలేదు. ఆరంభ సన్నివేశాలతో కలుపుకొంటే, తెరపైన మూడు కోణాల్లో కనిపిస్తారు. ప్రతి కోణంపైనా తనదైన ముద్రవేశాడు విజయ్. ముఖ్యంగా స్పై పాత్ర కోసం ఆయన మారిపోయిన విధానం, శ్రీలంక నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలపై బలమైన ప్రభావం చూపించారు. ఆయన చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. శివ పాత్రలో సత్యదేవ్ నటన మరో ప్రధాన ఆకర్షణ. ఈ ఇద్దరి తర్వాత సినిమాలో కనిపించే మరో కీలకమైన పాత్ర… మురుగన్. ఆ పాత్రలో మలయాళ నటుడు వెంకటేశ్ చాలా బాగా నటించాడు. స్మగ్లింగ్ కార్టెల్ ని నడిపే యువ నాయకుడిగా కనిపిస్తాడు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా.. సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్స్ పరంగా ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధానబలం. ప్రొడక్షన్ డిజైన్, స్టైలింగ్ కథా ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. ఈ కథని నిర్మాతలు ఎంత బలంగా నమ్మారో ఈ సినిమా నిర్మాణమే చెబుతుంది. సినిమా టేకింగ్, మేకింగ్ విషయంలో దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది.
బలాలు:
- విజయ్ దేవరకొండ
- కథాప్రపంచం… డ్రామా
- విజువల్స్, సంగీతం
బలహీనతలు:
- కొరవడిన భావోద్వేగాలు
- కొత్తదనం లేని కథనం
గమనిక: ఈ సమీక్ష మా అభిప్రాయం మాత్రమే.

One thought on “కింగ్డమ్ రివ్యూ”
Comments are closed.