క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించిన విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి..ముఖ్యంగా దక్షిణాదిలో చాలామందికి సుపరిచితులు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగారు ఆయన. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉందని ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ఆమెపై తన టీమ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిందన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ…

“నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ‘వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు హైలైట్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనీయండి’ అని వారితో చెప్పాను. మేము ఆమెపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాం. ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకూ దేనికీ భయపడలేదు. ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించవు” అని వివరించారు.

కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉందని.. దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బందిపడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బంది పెట్టారని తెలిపింది. తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. అయితే ఆమె తన పోస్ట్ ను కొన్ని గంటల్లో డిలీట్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ మరో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చింది. కోపంలో ఇలా చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు చెప్పింది.

Read More : కింగ్డమ్ రివ్యూ

One thought on “క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించిన విజయ్ సేతుపతి

Comments are closed.