మదర్సా విద్యార్థుల వినియోగంపై విమర్శలు

పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “ఆపరేషన్ సిందూర్” అనంతరం పాక్‌ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు పాక్‌ నాటకీయ వైఖరిని బట్టబయలుచేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

పాక్‌ పార్లమెంట్‌లో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్, అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా రక్షణ కోసం ఉపయోగిస్తామని ప్రకటించారు. “మదర్సాలు మాకు రెండవ రక్షణ వలయం లాంటివి. సమయానుసారంగా మేము విద్యార్థులను వాడుకుంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాక్‌ అంతర్గతంగానే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

విద్యార్థులను బలిపశువులుగా ఉపయోగించటం ఏమిటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యాసంస్థల పవిత్రతను కాపాడాలని, వాటిని రాజకీయ, యుద్ధ ప్రయోజనాల కోసం వాడొద్దని పలు వర్గాలు హితవు పలుకుతున్నాయి.

ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడులకు సంబంధించి ఆసిఫ్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. “భారత డ్రోన్ల కదలికలపై మాకు సమాచారం ముందే ఉండేది. కానీ ఆ స్థావరాల ఉనికి బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతో డ్రోన్లను కూల్చలేదు” అని జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు, భారత్‌పై చర్యలు తీసుకునే మార్గంలో అసమర్థత, అంతర్గత వ్యూహాల లోపాన్ని బయటపెడుతున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యాఖ్యలు పాక్‌లో రాజకీయంగా కలకలం రేపడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా పాక్‌ ఉగ్రవాద పోషణ, విద్యా వ్యవస్థ వినియోగంపై అనేక అనుమానాలకు తావిచ్చాయి.

Read More : పాకిస్థాన్‌లో భారీ పేలుళ్లు

One thought on “మదర్సా విద్యార్థుల వినియోగంపై విమర్శలు

Comments are closed.