కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్ల పాలనలో జవాబుదారీతనం చూపించలేదని, కేవలం ప్రచారార్భాటంపైనే దృష్టి కేంద్రీకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం అనంతరం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైలు ప్రమాదం—వాస్తవ పరిస్థితికి అద్దం
ముంబై నుంచి బయలుదేరిన ఓ లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు కిందపడటంతో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన దేశంలో రైల్వే రంగ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. “కేంద్ర ప్రభుత్వం తమ 11 ఏళ్ల సేవలను సెలబ్రేట్ చేసుకుంటోంది. కానీ ముంబై రైలు ప్రమాదం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది,” అని ఆయన ట్వీట్ చేశారు.
భారత రైల్వేలు వెన్నెముకలా మారినా…
“భారత రైల్వేలు కోట్లాది మంది ప్రజల రోజువారీ జీవితానికి వెన్నెముకలా మారాయి. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ అభద్రత, అధిక రద్దీ, గందరగోళానికి ప్రతీకగా మారింది,” అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వర్తమానం గురించి మాట్లాడకుండా 2047 కలలపై మాత్రమే దృష్టి పెట్టిందని ఆయన విమర్శించారు.
మృతుల కుటుంబాలకు రాహుల్ సంతాపం
థానే ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
Read More : కేరళ తీరంలో భారీ నౌకలో పేలుడు కలకలం…
