ప్రయాగ్ రాజ్ రైల్వే డివిజన్ భారీ ప్రణాళికలు
మహా కుంభ మేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అయితే ముఖ్యమైన మౌనీ అమావాస్య జనవరి 29న కావడంతో మహాకుంభ మేళాకు పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్ రాజ్ రైల్వే డివిజన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్ రాజ్‌లోని తొమ్మిది స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్ కోడ్ తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయనున్నారు. రోజువారీగా నడిచే రైళ్లతోపాటు అదనంగా 150 ప్రత్యేక రైళ్లను ఒకేరోజు నడపడం అసాధారణ విషయమని ప్రయాగ్ రాజ్ రైల్వే డివిజను పీఆర్వో తెలిపారు. మౌనీ అమావాస్య నాడు 10 కోట్లమందికి పైగా భక్తులు త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేయవచ్చని మేళా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అయితే త్రివేణి సంగమంలో ఇప్పటిదాకా 9 కోట్ల 25 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లు UP సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
