మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ – రాజకీయాల్లో కొత్త అడుగు!

భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే సమక్షంలో ముంబయిలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జాదవ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

సుదీర్ఘకాలం క్రికెట్‌లో సేవలందించిన కేదార్ జాదవ్ ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు ప్రకటించడంతో, ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. క్రికెట్‌లో తన ఆటతీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జాదవ్, ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది.

బీజేపీలో చేరిన తర్వాత కేదార్ జాదవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తోందని తెలిపారు. దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించడానికి బీజేపీనే సరైన వేదికగా భావించి పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. బీజేపీ పెద్దల మద్దతుతో సామాజిక సేవలకు పూర్తి సమయం కేటాయిస్తానని తెలిపారు.

ఈ పరిణామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కేదార్ జాదవ్ చేరికపై చర్చ మొదలైంది. ఓ ప్రముఖ క్రీడాకారుడు బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

Read More : సింగపూర్‌లో అగ్నిప్రమాదం.. పవన్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స

One thought on “మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ – రాజకీయాల్లో కొత్త అడుగు!

Comments are closed.