తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నిరంతరం ఢిల్లీకి ప్రయాణిస్తున్న రేవంత్‌ను “ఫ్లైట్ మోడ్ సీఎం”గా ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశ రాజధానికి అరవైసార్లు వెళ్లారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి అనేకసార్లు వెళ్లినా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించలేకపోయారని ఆమె విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ముఖ్యమంత్రి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా, బీసీలు మాత్రం చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను కోరుకుంటున్నారని కవిత స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు జరిగితే బీసీ సామాజిక వర్గం దీని తాలూకూ సమాధానం తప్పకుండా ఇస్తుందని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో రెండు జాతీయ పార్టీలు – బీజేపీ, కాంగ్రెస్ – మోసం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంచడం బాధాకరమన్నారు. బిల్లుకు మతపరమైన రంగు పులిమి బీజేపీ ఆమోదించడంలో సడలింపు చూపుతోందని విమర్శించారు. గుజరాత్‌లో రిజర్వేషన్లు అమలు చేసిన బీజేపీ, తెలంగాణలో మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో 50%కి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో న్యాయస్థానాలపై నెపం వేసుకుంటోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రిజర్వేషన్లకు దూరంగా ఉంచాలన్న ప్రయత్నమే బీజేపీ లక్ష్యమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Read More : తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

One thought on “రేవంత్ రెడ్డి ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ : Kavitha”
Comments are closed.