కశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉక్కు పాదం

కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ఉక్కు పాదం మోపుతున్నాయి. తాజాగా ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ రహస్య ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులతో కలిసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కుట్రలు జరుగుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం అందడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. సుదీర్ఘ గాలింపు అనంతరం రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు.

స్థావరంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ఉగ్రవాద సహాయక వస్తువులు లభ్యమయ్యాయి. ఉగ్రవాదుల ప్రణాళికలను ముందుగానే గుర్తించి భద్రతా బలగాలు మరోసారి తమ పనితనాన్ని నిరూపించుకున్నాయి.

ఇక దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోనూ భద్రతా బలగాలు నేడు కీలక ఆపరేషన్ చేపట్టాయి. ఖైమోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు అనుమానించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రతా కారణాల నేపథ్యంలో వారి వివరాలను ఇప్పటికీ వెల్లడించలేదు.

కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం ఉగ్రవాద మూలాలను పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు కొనసాగుతాయని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.

Read More : పోర్టులో భారీ పేలుడు – 400 మందికి గాయాలు

One thought on “కశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉక్కు పాదం

Comments are closed.