కరీంనగర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమైన మూడో రోజే ఓ నవ వధువు రోడ్డు ప్రమాదంలో మరణించింది. భర్త కళ్లెదుటే జరిగిన ఈ దుర్ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటన వివరాలు:
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల (22)కు, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన చిరుత రాజుతో ఆగస్టు 6న వివాహం జరిగింది. డిగ్రీ పూర్తి చేసిన అఖిల పీజీ చేయాలని నిర్ణయించుకుంది. వివాహం తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించడానికి భర్త రాజు అంగీకరించాడు.
ఈ నేపథ్యంలో, అఖిల నిన్న పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్ళింది. పరీక్ష ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ కాలనీ వద్ద హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక లారీ వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడిపోగా, అఖిల తల మీద నుంచి లారీ టైర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రాజుకు స్వల్ప గాయాలయ్యాయి.
మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భార్య కళ్లెదుటే మృతి చెందడంతో రాజు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : హైదరాబాద్ మెట్రోలో రికార్డు

One thought on “రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి”
Comments are closed.