కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో వివాదం.

ప్రఖ్యాత సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర స్థాయిలో కలకలం రేపాయి. తాను నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అనే వ్యాఖ్యలు చేసిన కమల్‌పై కన్నడప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కమల్‌పై ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, కన్నడ-తమిళుల మధ్య చిచ్చు పెడతాయని ఆరోపిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సారీ చెప్పిన కమల్ హాసన్
ఉద్భవించిన వివాదంపై స్పందించిన కమల్ హాసన్, తన వ్యాఖ్యలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంచేశారు. ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, తనకు భాషల చరిత్రపై అంతగా అవగాహన లేదని తెలిపారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని పేర్కొంటూ, ఈ విషయాన్ని భాషా నిపుణులకు వదిలేయాలని సూచించారు.

నిరసనలు, సినిమా బహిష్కరణకు పిలుపు
కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో థగ్ లైఫ్ సినిమా పోస్టర్లను దహనం చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు, ఆయన సినిమాలను నిషేధించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నేతల స్పందన
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వివాదంపై స్పందిస్తూ, “కమల్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదు” అన్నారు. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయన సినిమాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు.

ఈ వివాదం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read MOre : పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తిచేయిసారు

One thought on “కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో వివాదం.

Comments are closed.