కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా కేసీఆర్ క్యాబినెట్‌లో పనిచేసిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ఆయన మాట్లాడుతూ మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కుంగాయని, కాళేశ్వరం ద్వారా తెలంగాణలో సుమారు 35 శాతం భూభాగానికి నీరు అందుతోందని పేర్కొన్నారు.

ఇంకా ఈ ప్రాజెక్టుపై ముందుగా విచారణ జరిగిన సందర్భంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కమిషన్ ఎదుట హాజరై వివరాలు ఇచ్చారు. హరీష్ రావు ఈసారి విచారణలో ఏ విధంగా స్పందించనున్నారో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరానికి ప్రభుత్వం చెల్లించిన డబ్బులు, పాటించిన నిబంధనలపై కమిషన్ సవివరంగా ఆరా తీస్తోంది.

కాగ్ నివేదికలను పరిగణలోకి తీసుకుని కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుండి అఫిడవిట్లు స్వీకరించింది. వీరి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించారు.

అంతేకాకుండా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు చెల్లించిన అంశాలను కమిషన్ గుర్తించింది. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా విచారణకు హాజరుకానున్నారు. కమిషన్ ఈ నెలాఖరులో తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది.

read More : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్

One thought on “కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభం.

Comments are closed.