కడప జిల్లాలో బాలికపై జరిగిన పాశవిక ఘటనపై రాష్ట్ర హోం మంత్రి ఇప్పటికీ స్పందించకపోవడాన్ని ఎమ్మెల్సీ వరుడు కల్యాణి తీవ్రంగా ఖండించారు. మూడు సంవత్సరాల చిన్నారి పాపపై జరిగిన అత్యాచారానికి ప్రాణాలు పోయిన దారుణ ఘటనపై ప్రభుత్వం మౌనం పాటించడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు.
ఈ ఘటన జరిగిన కడప జిల్లా నుంచే మంత్రులు మహానాడు ఏర్పాట్ల కోసం సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉండటం దారుణమని పేర్కొన్నారు. ప్రజల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇటువంటి విషాద సంఘటనపై స్పందించకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు మహిళల రక్షణ, మహిళా సంక్షేమం గురించి చేసిన హామీలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గాలికొదిలేశాయని ఆరోపించారు. ప్రస్తుతం ఆడవాళ్లకు రక్షణ అనే భావన గాల్లో దీపంలా మాయమైందని, ఈ ప్రభుత్వం మహిళలపై దృష్టి పెట్టకుండా రాజకీయ సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
ఇలాంటి దారుణ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా స్పందించకపోతే, నేరాలకు అవకాశం పెరుగుతుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ వరుడు కల్యాణి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని, హోం మంత్రి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల భద్రత, మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read More : కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
One thought on “కడప ఘటనపై హోం మంత్రి మౌనం దారుణం: వరుడు కల్యాణి ఆవేదన.”
Comments are closed.