రేబిస్ కారణంగా యువ కబడ్డీ క్రీడాకారుడి మృతి

ప్రో కబడ్డీ లీగ్ 2026లో నిలువెత్తు ప్రతిభను చాటాలని ఆశించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి (22) రేబిస్ వ్యాధితో మరణించడంతో క్రీడా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి పొందిన బ్రిజేష్‌కు కొన్ని వారాల క్రితం ఓ వీధికుక్క కరిచినట్టు సమాచారం. అయితే ఆ గాయాన్ని తీవ్రంగా తీసుకోకుండా, అది సాధారణంగా ఆటలో తగిలిన గాయం అనుకొని నిర్లక్ష్యం చేసినట్లు తెలిసింది. బ్రిజేష్ కుక్క కాటుకు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో రేబిస్ లక్షణాలు తీవ్రతరమయ్యాయి. అనంతరం వైద్యులు ప్రయత్నించినా ప్రాణాలను రక్షించలేకపోయారు. ఈ విషాద ఘటనపై హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి. శివకుమార్ స్పందిస్తూ, “రేబిస్ లక్షణాలు బయటపడిన తర్వాత చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడటం చాలా క్లిష్టం. కుక్క లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే రేబిస్‌ను పూర్తిగా నివారించవచ్చు” అని స్పష్టం చేశారు.

జాగ్రత్తలు తీసుకోవాలి
జంతువు కరిచిన వెంటనే గాయాన్ని కనీసం 10-15 నిమిషాల పాటు సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఆపై వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి యాంటీ-రేబిస్ టీకా తీసుకోవాలని డాక్టర్ శివకుమార్ సూచించారు. వ్యాక్సిన్‌ను తీసుకోవడం ఎంతమాత్రం ఆలస్యం చేసినా ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు.

ఈ సంఘటన యువతకు గొప్ప గుణపాఠంగా నిలవాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

Read More : ఘన విజయంతో మెరిసిన భారత యువ ఛెస్‌ ప్లేయర్