ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ నాయకులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, అవసరం పూర్తయ్యాక వదిలేస్తోందని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఇదే పరిస్థితి ఈటల రాజేందర్‌కు కూడా వచ్చిందని పేర్కొన్నారు. బీసీలను ముఖ్యమంత్రులుగా చేస్తామని బీజేపీ చెప్పడాన్ని పాల్ హాస్యాస్పదంగా అభివర్ణించారు. “బీసీ ముసుగు ధరించి రాజకీయంగా ఉపయోగించుకోవడం బీజేపీ వ్యూహంగా మారింది. బండి సంజయ్‌ను తప్పించి, రాంచందర్ రావును ఎలా అవకాశం ఇచ్చారు?” అని ప్రశ్నించారు. తాను బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకి కాదని స్పష్టంచేస్తూనే, బీసీలకు న్యాయం చేయాలన్నదే తన ఆవేదన అని తెలిపారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూడా పాల్ విమర్శలు చేశారు. జైలులో కొన్ని రోజులుగా ఉన్న ఆమె బయటకు వచ్చిన వెంటనే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కవితను బీసీ నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందనీ, బీసీలకు న్యాయం చేయాలన్న దృక్పథంతో తాము ముందుకు వస్తున్నామని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Read More : ఆర్మీ ఆఫీసర్‌కు ఆన్‌లైన్ మోసం…
