తిరుపతిలో రాత్రి గస్తీలకు డ్రోన్ పహారా

తిరుపతి నగరంలో రాత్రి గస్తీలను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లూకోల్స్‌, రక్షక్‌ పోలీసులు రాత్రిపూట గస్తీలు నిర్వహిస్తున్నప్పటికీ, వీధులు, సందుల్లో పూర్తి నిఘా పెట్టడం కష్టంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలో అత్యాధునిక మ్యాట్రిస్‌ 4 థర్మల్‌ డ్రోన్‌ కెమెరాను ఉపయోగించి సోమవారం అర్ధరాత్రి తిరుపతి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో అనుమానాస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి, అందులో 10 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.

డ్రోన్ ప్రయోగం మరింత సమర్థంగా అమలవ్వేందుకు తిరుపతి నగరాన్ని మూడు జోన్లుగా విభజించారు. ప్రతి రోజు ఒక్కో జోన్‌లో డ్రోన్ నిఘా కొనసాగుతుంది. ఈ డ్రోన్‌ అరకిలోమీటరు ఎత్తుకు ఎగసి, మూడు కిలోమీటర్ల పరిధిలో నిఘా పెట్టగలదు.

అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్‌ను తక్షణమే స్పాట్‌కు మళ్లించే సాంకేతికత కూడా ఇందులో ఉంది. ఎక్కడి నుంచైనా కాల్ వచ్చిన వెంటనే, డ్రోన్ ఆ లొకేషన్‌ ట్రేస్‌ చేసి వెంటనే అక్కడికి చేరుకుంటుంది. ఈ విధంగా పోలీసులు తక్షణ స్పందనతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కొత్త నిఘా పద్ధతితో తిరుపతి ప్రజలు, భక్తులు అర్ధరాత్రయినా భయమేమీ లేకుండా ప్రశాంతంగా గడిపే పరిస్థితులు ఏర్పడుతాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు.

Read More : సింహాచలం చందనోత్సవంలో విషాదం