జ్యోతి మల్హోత్రా – పూరీ ఆలయంలో డ్రోన్ కలకలం

పాకిస్థాన్ నిఘా సంస్థలకు సున్నితమైన సమాచారం అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత వెలుగులోకి వస్తున్న వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. యూట్యూబ్ వీడియోల పేరిట పలు ప్రముఖ దేవస్థానాలను సందర్శించిన జ్యోతి, భద్రతా పరంగా అత్యంత సున్నితమైన స్థలాలైన పూరీ జగన్నాథ ఆలయం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కెమెరాలో బంధించిందని అధికారులు గుర్తించారు.

డ్రోన్ దృశ్యాలు.. భద్రతా విరామం?
2024లో పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో కలిసి జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన జ్యోతి మల్హోత్రా, ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ను ఎగురవేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవల ఈ ఆలయం ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల మధ్య, ఈ చర్య భద్రతా విరామంగా భావించబడుతోంది. డ్రోన్ ద్వారా ఏ ప్రాంతాలను చిత్రీకరించిందన్న అంశంపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు.

మహాకాళేశ్వర్ ఆలయ సందర్శనపై దృష్టి
అదేవిధంగా, గతేడాది ఏప్రిల్‌లో మహాకాళేశ్వర్ ఆలయాన్ని జ్యోతి సందర్శించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై ఇప్పటివరకు అక్కడ ఎలాంటి నేరారోపణలు నిర్ధారణ కాలేదని, కానీ ఆమె ఎవరి సాంగత్యంలో వచ్చింది, ఎక్కడ బస చేసింది అనే అంశాలపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

భద్రతా ఏజెన్సీలు అప్రమత్తం
ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. డ్రోన్ వాడకానికి సంబంధించి అమలవుతున్న నిబంధనలను ఉల్లంఘించి సున్నితమైన ప్రాంతాల్లో వీడియోలు తీసిన నేపథ్యంలో, దీని వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ కేసు విచారణ భద్రతా పరంగా కీలక మలుపు తీసుకుంటుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో… జ్యోతి మల్హోత్రా గత చరిత్ర, సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు, అనుమానాస్పద పరిచయాలపై నిఘా కొనసాగుతోందని సమాచారం.

Read More : డ్రైవర్ గుండెపోటు తో మరణం

One thought on “జ్యోతి మల్హోత్రా – పూరీ ఆలయంలో డ్రోన్ కలకలం

Comments are closed.