ముంబై నటి జత్వానీ కేసులో సీఐడీ కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. మే 5వ తేదీన సీఐడీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఈ ఇద్దరు అధికారులు గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకూ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా వెల్లడించిన వివరాలకూ పొంతన లేకపోవడంతోనే తాజా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును ఈ కేసులో విచారిస్తున్నారు. విశాల్ గున్ని గతంలో, జత్వానీని ముంబై నుంచి తీసుకురావాల్సిన బాధ్యత తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఆంజనేయులు అప్పగించారని తెలిపారు. అయితే ఆంజనేయులు మాత్రం తాను విశాల్ గున్నితో కేవలం నిఘా అంశాల మీదే మాట్లాడానని, జత్వానీ అంశంపై ఏ విధంగా కూడా చర్చించలేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
అలాగే కాంతి రాణాతోనూ తనకు ఎలాంటి చర్చలూ జరగలేదని ఆంజనేయులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ముగ్గురి వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో సీఐడీ మరింత స్పష్టత కోసం మరోసారి విచారణకు పిలవాలని నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ విచారణ అనంతరం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అంచనా.
Read More : సింహాచలంలో దుర్ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి..

One thought on “ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు”
Comments are closed.