జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్‌: ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై సైన్యం దాడి కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహదేవ్’లో భారత సైన్యం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించిందని ఆలిండియా రేడియో వెబ్‌సైట్ వెల్లడించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు, హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆశ్రయం తీసుకున్నట్లు గుర్తించడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించాయి. గత నెల రోజులుగా ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం భద్రతా బలగాలు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయగా, దాచిగామ్ అడవుల్లో రెండు రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను గుర్తించాయి. స్థానిక సంచార జాతులు కూడా ఉగ్రవాదుల కదలికలపై కీలక సమాచారం అందించారని అధికారులు తెలిపారు.

సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. స్థావరంలో ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. లిడ్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా, బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ విషయం ‘చినార్ కోర్’ (కశ్మీర్ వ్యాలీ మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించే విభాగం) తమ సామాజిక మాధ్యమ వేదికలో ధ్రువీకరించింది. దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ మహదేవ్’ అని పేరు పెట్టారు. జబర్వన్-మహదేవ్ పర్వతాల మధ్య ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా, ఇందులో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. మృతి చెందిన ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన విదేశీ ఉగ్రవాదులుగా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది.

ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read More : జమ్మూకాశ్మీర్ దాచిగామ్‌లో మహదేవ్ ఆపరేషన్ కొనసాగింపు