మరోసారి జగ్గారెడ్డి సంచలనం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి రాజకీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా ప్రకటించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తదుపరి తానే ఆ పదవికి అర్హుడని సంకేతాలు ఇచ్చారు. “మరిన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే ఆయన తరువాత అవకాశం వస్తే నేనూ సీఎం పదవిని ఆశించకుండా ఉండను,” అని తెలిపారు.

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. “కవిత మాట్లాడుతూ చేస్తున్న విమర్శలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆమె మాటలు వినడానికి దెయ్యాలు, వేదాలు వల్లించినట్టుంటున్నాయి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూతురు పొంది రాజకీయాల్లో కొనసాగడమే ఆమె ప్రత్యేకత,” అంటూ విమర్శల జాడి విసిరారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ఇన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కవితకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి?” అంటూ ప్రశ్నించారు. “కవిత ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? బతుకమ్మ ఆడుకుంటూ ఉండాలి గానీ ఈ రాజకీయ పంచాయితీలో ఎందుకు దిగారో అర్థం కావడం లేదు,” అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, “మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలు సమానస్థాయిలో ఉన్న నాయకులు. వారి మధ్య రాజకీయ విమర్శలు సహజం. కానీ కవిత మాట్లాడే స్థాయిలో మేము స్పందించలేము,” అంటూ తేల్చేశారు.

ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Read More : బోనాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త