హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిరాకరణ, పూణే ప్రాజెక్టుకు ఆమోదం

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు అనుమతి విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. తెలంగాణ ప్రభుత్వం అనేక మార్లు వినతులు చేసిందన్నా, ఇప్పటికే మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను కేంద్రానికి పంపి ఏడాది దాటిందన్నా, ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ హైదరాబాద్ మెట్రోపై ఒక్క చర్చ కూడా జరగకపోవడంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలుపుతోందని, తాజాగా మహారాష్ట్రలోని పూణే మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినదే దీనికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు మాత్రం ఎప్పటిలానే విస్మరణమే మిగిలిందని పలువురు నేతలు మరియు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న తెలంగాణకు చెందిన మంత్రులు కూడా మౌనంగా ఉండటం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలగా నిలవకపోవడంపై విపక్షాలతో పాటు ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోతే కేంద్రం అభివృద్ధి పనులకు ఆమోదం తెలపదా? అనే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.

తెలంగాణ ప్రజలు అభివృద్ధికి రాజకీయ రంగు పులుమకండి అంటూ కేంద్రానికి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన వివరాలతో సహా ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇంకా వాటిపై స్పందించకపోవడం బాధాకరమని అంటున్నారు.

ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించి తెలంగాణకు న్యాయం చేయాలని ప్రజలు, మేధావులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : మరోసారి జగ్గారెడ్డి సంచలనం