పాలకొల్లు, ఆగస్టు 6: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ పాలనలో ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కక్షలు, దాడులు, అక్రమ కేసులతో నిండిన “రెడ్ బుక్ రాజ్యాంగం” నడిచిందని వ్యాఖ్యానించారు.
సాక్షి దినపత్రికపై విమర్శలు
టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభలో బటన్ స్టిక్‌లతో తమపై దాడులు జరిపినప్పుడు సాక్షి దినపత్రిక నిశ్శబ్దంగా ఎందుకు ఉందని మంత్రి ప్రశ్నించారు. “మా మీద దాడులు చేసి, మాపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినప్పుడు మేము పోలీసులను ఆశ్రయించడం తప్పా?” అని నిలదీశారు.
టిడ్కో గృహాల నిధుల దుర్వినియోగం
తాము మంజూరు చేసి నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో ఒక్కింటిపై రూ.3.65 లక్షల రుణం చూపించి కోట్లాది రూపాయలను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి ఆరోపించారు.
వైసీపీ నాయకుల అక్రమాలపై ప్రశ్నలు
పాలకొల్లుకు చెందిన కొందరు వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్, అక్రమ సంపాదనలలో చిక్కుకున్నా సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ప్రశ్నించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఆ పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వ పనుల వివరాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలకొల్లు నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా రూ.430 కోట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read More : ధర్మవరం విషాదంలో మునిగింది
