ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తారాస్థాయికి..

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజా పరిణామాల్లో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) భారీ దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాల్లో ఉన్న ఆరు ప్రభుత్వ విమానాశ్రయాలపై దాడులు జరిపి 15 సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో భయానకతను మరింత పెంచాయి.

‘ఎక్స్’ వేదికగా ఈ వివరాలను వెల్లడించిన ఐడీఎఫ్, “ఇరాన్ గగనతలంపై ఆధిపత్యాన్ని పెంచే లక్ష్యంతో విమానాశ్రయాలపై దాడులు చేశాం. రన్‌వేలు, భూగర్భ బంకర్లు, రీఫ్యూయెలింగ్ విమానం, అలాగే ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 విమానాలు ధ్వంసం అయ్యాయి” అని తెలిపింది. డ్రోన్లను ఉపయోగించి ఈ దాడులు జరిగాయని వెల్లడించింది. ఈ దాడులతో ఇరాన్ వైమానికశక్తి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంది.

ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, తమ లక్ష్యాలకు చేరువలో ఉన్నామని, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని చెప్పారు. “మా ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుందో లక్ష్యాలు సాధించిన తర్వాతే తెలుస్తుంది. పోరాటం అలా ఇట్టే ఆగదు” అని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ఇప్పటికే 11వ రోజుకు చేరుకోగా, జూన్ 13న ప్రారంభమైన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ తర్వాత ఇరాన్ కూడా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3’ పేరుతో ప్రతిదాడులకు దిగింది. ఇక శనివారం అమెరికా ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేయడం ప్రపంచాన్ని కలిచివేసింది.

ఈ వరుస ఘటనలతో పశ్చిమాసియా యుద్ధ మేఘాల్లో చుట్టుముట్టిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఎటు తిరుగుతుందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠగా మారింది.

read More : ఇరాన్ అణు వివాదం ముదురింత

One thought on “ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తారాస్థాయికి..

Comments are closed.