దేశవ్యాప్తంగా యూపీఐ అమలుకు తపాలా శాఖ సన్నాహాలు

దేశంలోని తపాలా కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపులకు మార్గం సుగమమవుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తేనుందికి తపాలా శాఖ సన్నాహాలు చేపట్టింది. ఇకపై నగదు చెల్లింపులకు బదులు వినియోగదారులు సురక్షితంగా, సులభంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ లావాదేవీలు చేయనున్నారు.

ప్రస్తుతం పోస్టాఫీసుల్లో ఉపయోగంలో ఉన్న సాంకేతిక వ్యవస్థలో యూపీఐ అనుసంధానం లేకపోవడంతో, ‘ఐటీ 2.0’ పేరుతో కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఈ నూతన విధానం అమలుకు ముందుగా కర్ణాటకలోని మైసూరు, బాగల్‌కోట్ తదితర ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించారు. మెయిల్ ప్రొడక్టుల బుకింగ్, ఇతర సేవల కోసం QR కోడ్ ఆధారిత చెల్లింపులు విజయవంతమయ్యాయి. పాత స్టాటిక్ క్యూఆర్ కోడ్ విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, వినియోగదారుల ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మరింత భద్రతతో కూడిన డైనమిక్ విధానాన్ని ఎంపిక చేశారు.

ఈ డిజిటల్ మార్పు లక్షలాది మంది పోస్టాఫీస్ వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని అందించనుంది. పోస్ట్, పార్శిల్ సేవలు, పొదుపు పథకాల డిపాజిట్లు వంటి సేవలన్నింటికీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నగదు రహిత భారత్ లక్ష్య సాధనలో ఈ అడుగు కీలక మైలురాయిగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Read More : వివో T4 లైట్ 5G భారత్‌లో విడుదల

One thought on “దేశవ్యాప్తంగా యూపీఐ అమలుకు తపాలా శాఖ సన్నాహాలు

Comments are closed.