మోదీ జెండా ఊపి ప్రారంభం !

భారత్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ, ఎగుమతుల రంగంలో చరిత్ర సృష్టించింది. ఇకపై ‘మేడ్ ఇన్ ఇండియా’ ఈవీలు ప్రపంచంలోని 100 దేశాల రోడ్లపై దూసుకెళ్లనున్నాయి. అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు. అదే వేదికపై హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల స్థానిక ఉత్పత్తికి కూడా ఆయన శుభారంభం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ రంగాల్లో భారత్ త్వరలోనే ప్రపంచ హబ్‌గా ఎదగనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “గతంలో ఈవీలకు అవసరమైన బ్యాటరీలను దిగుమతులపైనే ఆధారపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మూడు ప్రముఖ జపాన్ కంపెనీలు భారత్‌లోనే బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రోడ్‌లు తయారు చేస్తున్నాయి. ఇది మన హైబ్రిడ్ వాహనాల మార్కెట్‌కు కొత్త ఊపునిస్తుంది” అని ఆయన చెప్పారు. భారత్-జపాన్ బంధం వ్యాపారానికే పరిమితం కాదని, చారిత్రక, సాంస్కృతిక మూలాలున్నాయని ప్రధాని గుర్తుచేశారు. “సుజుకి వంటి జపాన్ కంపెనీలు ఇక్కడ తయారు చేసిన కార్లను తిరిగి జపాన్‌కే ఎగుమతి చేస్తున్నాయి. ఇది రెండు దేశాల బలమైన సంబంధాలకు నిదర్శనం. మారుతి సుజుకితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం గత దశాబ్దంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని వివరించారు. “వ్యాపార అనుకూల వాతావరణం, లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లతో పెట్టుబడులకు మార్గం సుగమం చేశాం. ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పదేళ్లలో 500 శాతం పెరిగింది” అని తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలను వివరించిన మోదీ, “ఇక్కడితో ఆగం. ఇకపై సెమీకండక్టర్ల తయారీపై దృష్టి పెడతాం. ఆరు ప్లాంట్లు త్వరలో సిద్ధం కానున్నాయి. అదేవిధంగా కీలక ఖనిజాల కోసం ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రారంభించాం” అని ప్రకటించారు. అభివృద్ధి అనుకూల విధానాల్లో రాష్ట్రాలు పోటీపడాలని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింతగా చూరగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Read More : క్షమాపణలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి