సంగీత దిగ్గజం ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సంస్థ ‘ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ (IMMA) దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఐఎంఎంఏ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. దీంతో ఈ కాపీరైట్ వివాదం బాంబే హైకోర్టులోనే కొనసాగనుంది. సోనీ మ్యూజిక్ తన ఫిర్యాదులో, ఐఎంఎంఏ తమ 536 టైటిల్స్‌లో కనీసం 228 ఆల్బమ్‌లను మూడో పక్షంతో స్ట్రీమింగ్ చేయించిందని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అని ఆరోపించింది. ఈ ఉల్లంఘన 2021 డిసెంబరులో గుర్తించామని, 2022లో కేసు వేసామని తెలిపింది. తమ పాటలపై రాయల్టీ హక్కులు క్లెయిమ్ చేయకుండా ఐఎంఎంఏను నిరోధించాలని కోరింది.
దీనికి ప్రతిగా ఐఎంఎంఏ, సోనీ తప్పుడు అత్యవసర పరిస్థితి సృష్టిస్తోందని, ఇళయరాజా రచనలు 2015 నుంచి ‘ట్రెండ్ లౌడ్ డిజిటల్’ ద్వారా పంపిణీ అవుతున్నాయని వాదించింది.
ఇక మద్రాస్ హైకోర్టులో ఇళయరాజా, ఎకో రికార్డింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై 310 పాటల కాపీరైట్ హక్కుల కోసం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ హక్కులు ఎకో నుంచి సోనీకి బదిలీ అయ్యాయి. మద్రాస్ హైకోర్టు ఎకోను సౌండ్ రికార్డింగ్‌ల చట్టబద్ధ యజమానిగా గుర్తించినప్పటికీ, ఇళయరాజాకు తన రచనలపై నైతిక హక్కులు ఉన్నాయని తీర్పు ఇచ్చింది.
Read More : సోషల్ మీడియా ట్రోల్స్‌పై రకుల్ ఆగ్రహం

One thought on “ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ”
Comments are closed.