విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇక లేరు

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం (13 జూలై) తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు.

కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బ్రహ్మానందం వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగాయి. కోట పెద్ద మనవడు శ్రీనివాస్ అంతక్రియలు పూర్తిచేసాడు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. కోట కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు.. శ్రీనివాస్ పెద్ద మనువడు కాగా హర్ష చిన్న మనువడు.

కోట శ్రీనివాస్ సినీ ప్రస్థానం చూస్తే… ఒక తండ్రిగా, తాతగా, విలన్ గా, కమెడియన్ గా, నిస్సహాయుడిగా, క్రూరుడు, దుర్మార్గుడిలా… ఇలా ఆయన ఏ వేషం వేసినా, ఏ పాత్ర ధరించినా దానికో ప్రత్యేక గుర్తింపు. విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్ స్క్రీన్ ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోట శ్రీనివాస రావు తన సినీ ప్రయాణాన్ని ముగించారు.

కోట శ్రీనివాస్ రావుకి తొలి ఛాన్స్ ఎలా వచ్చిందంటే..

1978 లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో రావు గోపాలరావు ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. అప్పటికే ‘ప్రాణం ఖరీదు’ నాటకానికి ప్రజల్లో ఆదరణ ఉంది. అందులో కోట నటించారు. ఆ నాటకాన్ని నిర్మాత వాసు, దర్శకుడు క్రాంతి కుమార్ చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్. రావు సినిమాకి కూడా రచయిత. ఆయనకు కోట అంటే చాలా సెంటిమెంట్ ఉండేది. దీంతో ‘ప్రాణం ఖరీదు’లో చిన్న వేషం ఉంది.. చేయాలని కోరారు. అలా కోట ప్రయాణం మొదలైంది.

అయితే, ఈ సినిమా తర్వాత ఆయన సుమారు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. హైదాబాద్ లోని స్టేట్ బ్యాంక్ లో మంచి ఉద్యోగం ఉండటంతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు. జంధ్యాల గారితో ఉన్న పరిచయం వల్ల 1983 లో అమరజీవి చిత్రంలో నటించారు. అదే ఏడాదిలో విజయశాంతి ప్రతిఘటనలో అవకాశం వచ్చింది. 1985లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఆ రాత్రికి రాత్రే కోట స్టార్ అయిపోయారు. ఆయనకు వరుసగా భారీ ఆఫర్లు రావడంతో 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు

One thought on “విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇక లేరు

Comments are closed.