ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి .. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

సికింద్రాబాద్: తెలంగాణలో బోనాల పండుగ సంబరాలు అంబరాన్నిఅంటున్నాయి. జంట నగరాల్లో ఎక్కడ చూసినా ఆడపడుచుల బోనం, పోతురాజుల విన్యాసాలు, యువత, పిల్లల సందడే కనిపిస్తోంది. ఇక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు.

కాగా, బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను” అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.