కూకట్‌పల్లిలో దారుణం: హత్యా? ప్రమాదమా?

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డుప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా ఒక మహిళ వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ప్రమాదం వెనుక హత్య కోణం ఉందా అనే అనుమానాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…
కృతిక అనే మహిళ తన భర్త అమిత్ కరణ్, కుమారుడు మాధవ్‌, అత్తమామలతో కలిసి ఆదివారం గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో వారి కారు మొరాయించడంతో కృతిక కిందకు దిగి సహాయం కోసం ఎదురుచూస్తుండగా, వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం అకస్మాత్తుగా పక్కకు వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

బాధితురాలిని ఢీకొట్టిన బొలెరో వాహనం సంఘటనా స్థలంలో ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇది ఒక సాధారణ రోడ్డుప్రమాదమా? లేక పథకం ప్రకారం జరిపిన హత్యా? అనే కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Read More : సర్పంచ్ ఎన్నికల జాప్యం పై హైకోర్టు ఆగ్రహం